Site icon NTV Telugu

Telugu states CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై ఉత్కంఠ..!

Telugu States Cms Meet

Telugu States Cms Meet

Telugu states CMs Meet: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఈ అంశంతోపాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తిశాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్‌ అజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ముఖ్యమంత్రుల సమయం కోరినా, సానుకూల స్పందన రాకపోవడంతో 16వ తేదీకి వాయిదావేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ తేదీన హాజరుకావడానికి అంగీకరించినట్లు సమాచారం.

Read Also: Off The Record: గ్రూపులుగా విడిపోయిన సత్యవేడు టీడీపీ.. ఎమ్మెల్యే సాబ్‌ ఎందుకు వాయిస్‌ పెంచారు..?

తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బనకచర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా నదిపై పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ప్రస్తావించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్‌ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలిపింది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని తెలిపింది.

Read Also: HONOR X70: 8300mAh భారీ బ్యాటరీ, బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్ తో హానర్ X70 గ్లోబల్ లాంచ్..!

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా ఉండాలి. చైర్మన్, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులు గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో ఈ అంశాలను చర్చించాల్సి ఉంది. గత పదేళ్లలో రెండు సమావేశాలు జరిగాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ఇప్పటికే ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రితో జరిగే సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Exit mobile version