Gidugu Venkata Ramamurthy: ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) పంతులు ముఖ్యుడు. ఆయన ఉపాధ్యాయుడిగా, చరిత్ర, శాసన పరిశోధకుడిగా, వక్తగా, విద్యావేత్తగా బహుముఖ రంగాల్లో విశేష సేవలందించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని(ఆగస్ట్ 29) మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలను నిజం చేస్తూ గిడుగు వారు తెలుగు భాషాకు చేసిన సేవలు ఏంటి, ఆయన కృషిని ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kamareddy, Medak Floods : అంతులేని నష్టాన్ని మిగిల్చిన కుంభవృష్టి
దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో తెలుగు భాష ఒకటిగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. దీనికి మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.
వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో ఒకరు..
ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1880లో ఆయన తన వృత్తి జీవితాన్ని పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టారు. అప్పటి నుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒడిశాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒడిశా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై గిడిగు వెంకట రామమూర్తి పంతులు తన అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.
ప్రతి తెలుగువాడిపై బాధ్యత ఉంది..
తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను గౌరవించటానికి మనం ప్రతి యేటా ఆగస్టు 29న ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. ఈక్రమంలో తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. తెలుగు భాష కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో కొందరు మాతృభాషపై మమకారాన్ని చూపించకపోగా.. తెలుగు భాషలో మాట్లాడటాన్ని అవమానంగా భావిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కనువిప్పు కలిగించడంతో పాటు, మన మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి.