తెలుగు అకాడమీ స్కాం కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇందులో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. అసలు ఇందులో కీలక సూత్రధారులు ఎవరు? ఎక్కడి నుంచి ఎవరికి నిధులు మళ్లాయి?తెలుగు అకాడమీ స్కాంలో ఇంకెవరెవరున్నారు? కీలక సూత్రధారులు ఎవరు అన్నదానిపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమార్, శ్రీనివాస్, సోమశేఖర్ కోసం గాలిస్తున్నారు. నకిలీ ఆధారాలను రాజ్‌కుమార్ తయారు చేసినట్లు గుర్తించారు.
మస్తాన్‌వలి, సత్యనారాయణ కలిసి నిధులు మళ్లించినట్లు నిర్ధారించారు. ఏపీ, ముంబైతోపాటు హైదరాబాద్‌లోని కొంతమందికి డబ్బులు చేర్చినట్లుగా దర్యాప్తులో తేల్చారు పోలీసులు.ఎఫ్‌డీలను డ్రా చేయాలనే ఆలోచన మస్తాన్ వలిదే అని తెలుస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర బ్యాంకులకు తరలించి డబ్బులు డ్రా చేసింది మస్తాన్ వలీ గ్యాంగ్. 6 నెలల కాలంలో 64 కోట్లు దోచేశారు. ఇందుకు అకాడమీకి చెందిన వ్యక్తులు మస్తాన్‌వలీకి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు.. అకాడమీలోని అకౌంట్ సెక్షన్‌లో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అరెస్టు చేసిన నలుగురిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు సీసీఎస్ పోలీసులు.మరోవైపు తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారికి సైతం పిలుపువచ్చింది. అంతేకాదు అకాడమీ ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అటు విచారణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫితో ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.