Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా రవాణా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై ఉక్కుపాదం మోపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా కమిషనర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఓవర్‌లోడింగ్ (పరిమితికి మించి లోడ్) వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే వెంటనే సీజ్ చేయాలని రవాణా అధికారులకు సూచించారు.

గతంలో చెక్‌పోస్టులను రద్దు చేసిన సమయంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ తనిఖీల వేగాన్ని పెంచాలన్నారు. జూన్ 8 నుంచి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రంగంలోకి దించిన మొబైల్ స్క్వాడ్‌ల పనితీరును సైతం ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. త్రైమాసిక పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్న వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. స్లీపర్ బస్సుల్లో జరిగే నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించకుండా, గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.