Site icon NTV Telugu

Rain Alert : నేడు తెలంగాణకు వర్ష సూచన

Rain

Rain

Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Marriage Scam: భర్త, పిల్లలు ఉన్న సరే.. మరో యువకుడిని పెళ్లాడిన మాయలేడీ.. చివరకి..?

మంగళవారం (జూన్ 10) నాడు మరిన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాల సూచనలతోపాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశముండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) వెల్లడించింది.

సాధారణంగా జూన్ మొదటి వారం నాటికి రాష్ట్రంలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి కొంత ముందుగానే వచ్చాయి. దాంతో మే చివరిలో వాతావరణం శీతలీకృతమైంది. అయితే ఆ తర్వాత మరికొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయి, ప్రజలు తీవ్ర ఉక్కపోతకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాల హెచ్చరిక ప్రజలకు ఊరటనిచ్చే పరిణామంగా భావించవచ్చు. అయితే వర్షాల సందర్భంగా పిడుగులు పడే అవకాశమూ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!

Exit mobile version