Marriage Scam: పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్య కూడిన ఓ పవిత్ర బంధం. కానీ, కొంతమంది ఈ బంధాన్ని మోసాల సాధనంగా మార్చేస్తున్నారు.పెళ్లి చేసుకుని జీవితాన్ని ఏర్పరుచుకుకోవాలన్న ఆశతో ఓ అమాయక యువకుడు మోసపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వెలుగుచూసింది. అమ్మాయికి ఎవరు లేరంటూ నమ్మించి మధ్యవర్తులు ఏర్పాటు చేసిన పెళ్లి… చివరికి ఓ మోసపు నాటకంగా మారింది. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తాను పెళ్లిచేసుకున్న మహిళ కనిపించకుండా పోవడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
Read Also: Gadikota Srikanth Reddy: రాయచోటి ఓటింగ్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం వివిధ మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి పరిచయంతో గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే మధ్యవర్తులతో పరిచయం ఏర్పడింది. మధ్యవర్తులు కరుణావతి అనే యువతిని పరిచయం చేస్తూ.. ఆమెకు తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని చెప్పారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఎలాంటి సమాచారం తెలుసుకోకుండానే రూ.2 లక్షలు మధ్యవర్తులకు చెల్లించి, ఈ నెల 1వ తేదీన తన గ్రామంలో కరుణావతిని పెళ్లి చేసుకున్నాడు.
Read Also: Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!
వివాహం జరిగిన కొన్ని రోజులకే కరుణావతి తన భర్తకు నాయనమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి ఈ నెల 6న విజయవాడ బయలుదేరి బస్టాండ్‌కు వచ్చారు. అక్కడ కరుణావతి టాయిలెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ కావడంతో రాజశేఖరరెడ్డి అప్రమత్తమై కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. ఇక వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే విచారణలో ఆశ్చర్యకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ కొండపల్లి ప్రాంతానికి చెందిన కరుణావతికి ఇప్పటికే వివాహమై, ముగ్గురు పిల్లలతో కుటుంబం ఉన్నట్లు తేలింది. డేటింగ్ యాప్‌లు, మ్యారేజ్ మాధ్యమాల్లో కొత్త వ్యక్తులను మోసగించేందుకు ఆమె ఇదే విధంగా ప్లాన్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. మాయలేడీగా పేరుగాంచిన ఈ మహిళ ఇంతకముందు మరెంతమంది అమాయకులను మోసపెట్టిందో గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. కేసు పురోగతి మేరకు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.