Minister Seethakka : తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పెరుగుతుండటం, అనేక మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అనేక మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కులగణన, SC వర్గీకరణ, ఉచిత బస్ సర్వీసు, రేషన్ కార్డు వంటి పథకాల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు” అని తెలిపారు.
సీతక్క మాట్లాడుతూ, “మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, బీఆర్‌ఎస్‌కు హీటుగా మారాయి. అందుకే వారు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష ధోరణిని అవలంబిస్తున్నారు. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వారు కాంగ్రెస్ పాలనపై విశ్వాసం పెంచుకుంటున్నారు” అని అన్నారు.
Rolls Royce Ghost: రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన చేపట్టిన విషయాన్ని మంత్రి సీతక్క ప్రస్తావించారు. “బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కులగణనపై ఏ చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతంగా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లింది. ప్రజల కోసం పనిచేయాల్సిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం విమర్శలు చేయడానికే పరిమితమవుతోంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంటి ఇంటికి తిరిగి మేము కులగణన సర్వే పూర్తి చేశాం. కానీ ఈ సర్వేలో కొన్ని అంశాలు తక్కువగా ఉన్నాయని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ గతంలో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు” అని సీతక్క ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని, అందుకే అధిక సంఖ్యలో పార్టీకి చేరుతున్నారని మంత్రి అన్నారు. “ప్రజల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. మా పాలనలో తెలంగాణ ప్రజలు న్యాయమైన అవకాశాలు పొందుతున్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమై పనిచేసే మన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు పెద్ద సమస్యగా మారింది. అందుకే వారు తట్టుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. మా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు మేలుకొని, వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నాను” అని మంత్రి సీతక్క అన్నారు.
IND vs ENG: రోహిత్ శర్మకు ఏమైంది.. ఇలా అయితే కష్టమే..!