Guinness World Record: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పణికేరా తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాడు. కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మాన్” అని పిలుస్తారు. ఈ సందర్బంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అద్భుతమైన విజయానికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. “ఒక నిమిషంలో అత్యధికంగా 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ నాలుకతో ఆపిన రికార్డు – క్రాంతి కుమార్ పణికేరా (డ్రిల్ మాన్) పేరుతో నమోదు” అని పేర్కొనింది.
Also Read: HYDRA: నేడు మాదాపూర్‌లో కూల్చివేతలకు రంగం సిద్దం
ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో.. క్రాంతి తన పొడవాటి జుట్టు, రంగురంగుల షర్ట్‌తో కనిపించగా, ఆయన ఎదుట ఫ్యాన్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఆ వేగంగా తిరిగే బ్లేడ్స్‌ను తన నాలుకతో ఆపడం ద్వారా ఆయన అందరిని ఆశ్చర్యపరిచారు. అక్కడ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతి కుమార్ తన నాలుకతో అమాంతం ఆపేయడం వీడియోలో గమనించవచ్చు. ఇలా చేస్తున్న సమయంలో అతని నాలుకకు గాయం అయినట్లుగా కనబడుతుంది. తన నోటి నుండి రక్తం రావడం వీడియోలో గమనించవచ్చు. ఇక ఈ భయానకర వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
తన రికార్డు గురించి క్రాంతి కుమార్ పణికేరా మాట్లాడుతూ.. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. అక్కడ కలలు కనడం అక్కడ ‘ఒక పెద్ద కల’ లాంటిది. కానీ, నేడు నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించడం నా జీవితంలో ఓ అద్భుతమైన ఘట్టం. ఇది కేవలం నా వ్యక్తిగత విజయమే కాకుండా కఠోర శ్రమ, పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు. ఇక ఈ సాహసం సంబంధిత వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దాదాపు 60 మిలియన్ల వ్యూస్ పొందిన ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో అనేక భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ఆయన నాలుకకు ఏమైంది?” అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో “ఇలాంటి రికార్డును సాధించాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు.