NTV Telugu Site icon

Telangana Jana Garjana: ఖమ్మంలో కాంగ్రెస్ ‘తెలంగాణ జన గర్జన’ హైలెట్స్ ఇవే..

Telangana Jana Garjana

Telangana Jana Garjana

Telangana Jana Garjana Highlights: తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఇవాళ ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ జన గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభా వేదికగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీలో చేరడంతో పాటు కొన్ని కీలక హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ‘తెలంగాణ జన గర్జన’ భారీ బహిరంగ సభ హైలెట్‌ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

గద్దర్ కొత్త పార్టీ లేనట్లే.. !
కాంగ్రెస్ జనగర్జన సభలో ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచారు. ఇటీవలే ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జెండాలో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారని పెద్ద ఎత్తున రూమర్స్ రాగా.. సీన్ కట్ చేస్తే.. ఖమ్మం సభలో గద్దర్ కనిపించారు. గద్దర్ కొత్త పార్టీ లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్‌ను ఆత్మీయంగా పలకరించి గద్దర్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రాహుల్‌కు గద్దర్ ముద్దుపెట్టారు. సభకు వెళ్లే ముందు కేసీఆర్‌పై గద్దర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టేనని.. కేసీఆర్ పాలన నిర్బంధపూరితంగా నడుస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్‌ కండువా కప్పిన రాహుల్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిక అనంతరం జన గర్జన సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని పొంగులేటి అన్నారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . “రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ కేవలం మాటలకే పరిమితమయ్యారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాం. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో కలిపేయాల్సిందే: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాల్సిందేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భారత్ జోడోయాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్ యాత్ర అంటూ ఆయన స్పష్టం చేశారు. పీపుల్స్ యాత్ర నా పాదయాత్ర కాదు.. యాత్రలో తనను అడగడుగునా ప్రజలు ప్రోత్సహించారన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వమే అంటూ విమర్శలు గుప్పించారు. ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. ధరణికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్పారని ఈ సందర్భంగా భట్టి చెప్పుకొచ్చారు. ధరణికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారన్నారు. మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారని.. కానీ పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయన్నారు.

ఎన్నికల హామీలు ప్రకటన

ఖమ్మం సభలో ఎన్నికల హామీలను రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. చేయూత పథకం ద్వారా అందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తామన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలొస్తాయని రాహుల్ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ బీటీమ్ మధ్యే పోరు ఉంటుందన్నారు. విపక్షాల భేటీకి బీఆర్ఎస్‌ పార్టీని ఆహ్వానించాలని.. అన్ని పార్టీలు కోరితే కాంగ్రెస్ విభేదించిదన్నారు. కాంగ్రెస్‌లో నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగిరావాలని.. వారికి కాంగ్రెస్‌లో తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించబోతున్నామన్నారు.

అధికారం కాంగ్రెస్‌దే: రేవంత్ రెడ్డి
డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలను చూసి సోనియా చలించిపోయారని.. బలిదానాలు చూడలేకే తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌ వరకు తరమాలని రేవంత్ అన్నారు. భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టోగా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తే తొలిసంతకం దానిపైనే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం రూ.4వేల రూపాయలు పింఛన్‌ ఇచ్చే చేయూత పథకంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. చేయూత పథకాన్ని ప్రకటించినందుకు రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.