MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్‌ను చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. ఇప్పటికే కేసుకు సంబందించిన సీడీలు పెన్ డ్రైవ్‌లను ముఖ్యమంత్రి కోర్టుకు పంపారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి ఆధారాలను దేశంలోని ప్రధాన మీడియా సంస్థలతో పాటు, సుప్రీం కోర్టు ప్రధాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పలువురికి పంపనున్నట్టుగా కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్‌లను కోర్టుకు పంపారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను తెలంగాణ హైకోర్టు మరికొంతకాలం పొడిగించింది. ఈ నెల 22 వరకు స్టే పొడిగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్లు వాదించారు. బీజేపీ తెలంగాణ విభాగం తరపున సీనియర్ న్యాయవాది జే. ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపే అధికారం సిట్‌కి గానీ, మొయినాబాద్ పోలీసులకు గానీ, ఏసీపీకి గానీ లేదన్నారు. సిట్‌ను నియమించే జీఓలో కూడా అవినీతి నిరోధక చట్టం ప్రస్తావన లేదని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నియమించారని చెప్పారు. సెక్షన్ 17(బీ) ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.
2003లో ఏసీబీ పరిధిని నియమిస్తూ జీఓ జారీ చేశారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీనే విచారించాలని జీఓ ఉందని పేర్కొన్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్ వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మీడియా ముందు పెట్టిన ఫుటేజ్‌ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటికి వెళ్లాయని పిటిషనర్లు ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని రేపు తుది వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.
Earthquake: పాల్వంచలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
ఇకపోతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. సింహయాజీ గత బుధవారం చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితులకు ఏసీబీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే వీరు విడుదలైన వెంటనే వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.