Site icon NTV Telugu

TS Govt: నేడు సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయనున్న ప్రభుత్వం.. ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ దొరికేనా?

Supreme Court

Supreme Court

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్‌ దాఖలుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్‌ రెడ్డి, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో సైతం సీఎం చర్చించారు.

Also Read: Cricket Tragedy: చివరి బంతి వేశాడు, మ్యాచ్ గెలిపించాడు.. కానీ మైదానంలోనే మరణించాడు!

హైకోర్టు తీర్పు ప్రతితో పాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన ఇతర పత్రాలను తెలంగాణ అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌ రెడ్డితో పాటు సీనియర్‌ న్యాయవాదులు ఈరోజు సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపైనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లను హైకోర్టులో సవాల్‌ చేసి స్టే పొందిన పిటిషనర్‌ మాధవ రెడ్డి.. గత శుక్రవారమే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేస్తే.. తమ వాదనలు విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Exit mobile version