Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్పాహార పథకాన్ని ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యకరమైన అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి పేర్కొన్నారు. ఖాళీ కడుపుతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు పాఠాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారని, వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
సహజ వనరులు ఎంత ముఖ్యమో, మానవ వనరులు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్న డిప్యూటీ సీఎం.. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడి పెడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 22 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించడం చిన్న విషయం కాదని, ఇది దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో కూడా అరుదైన కార్యక్రమమని వ్యాఖ్యానించారు.
ఈ పథకాన్ని రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తామని తెలిపారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందించేలా మెనూను రూపొందించామని వెల్లడించారు. పాలన అంటే అధికారం చెలాయించడం కాదని.. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన పాలన అని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించిన సమయంలో వారి కళ్లలో కనిపించిన ఆనందమే ప్రభుత్వ పనితీరుకు నిజమైన గుర్తింపు అన్నారు.
మధిర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామని, మహిళలకు ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం సరైంది కాదని.. అలా మాట్లాడేవారు పూర్తి అవగాహన లేకుండా వ్యాఖ్యానిస్తున్నారని భట్టి విమర్శించారు. మధిర ప్రజలు తనను గెలిపించడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అల్పాహార పథకం కేవలం మధిర నియోజకవర్గానికే పరిమితం కాదని, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

