Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మరియు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటన చేశారు. ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొండంత అండగా నిలవాలనే మానవీయ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై గానీ, ఉద్యోగులపై గానీ ఎలాంటి రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ ప్రమాద బీమాను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మంది లబ్ధి పొందుతున్నారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, మల్టీపర్పస్‌ వర్కర్లు, డైలీవేజ్, ఎన్ఆర్ఈజీఎస్, ఎంటీఎస్, సెర్ప్‌ సిబ్బంది ఉన్నారన్నారు. వీరితో పాటు 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ బీమా ధీమా వర్తిస్తోందని వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 98 క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించి బాధితుల కుటుంబాలకు కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తి చేసినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. బీమాతో పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక హెల్త్‌కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని శాసనసభ వేదికగా తెలిపారు.