NTV Telugu Site icon

Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్‌భవన్‌”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం

Telangana

Telangana

Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్‌ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Also Read: Warangal: బీహార్ యువకుడి దారుణ హత్య

అలాగే అదానీ గ్రూప్‌ పై అమెరికాలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో భారత ఆర్థిక వ్యవస్థ పరువు దెబ్బతిందని కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వీటితోపాటు మణిపూర్‌లో హింస, విధ్వంసాలపై ప్రధాని స్పందించకపోవడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిరసనలో భాగంగా ఉదయం 11 గంటలకు ” చలో రాజ్‌భవన్‌ ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జనసమీకరణ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికను రూపొందించింది. అక్కడి నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా సాగనున్నారు. ఈ నిరసనలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తించనుంది.

Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి

Show comments