Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతం కంచుకోటగా ఉండగా.. తాజాగా ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Bandi Sanjay Kumar: చిల్లర ఆటలు ఆపి హామీలు, వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి
తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతోపాటు మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకకాలంలో ఒకే సమయంలో రెండు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టి.జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఇరువురి పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు.