CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచాలని ఈసీని కోరారు. రాష్ట్రంలో దాదాపు 73.39 లక్షల మంది (అంటే మొత్తం ఓటర్లలో 21.7%) ‘అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్’ (ASDD) జాబితాలోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రాఫ్ట్ రోల్‌లో రకరకాల లోపాలు, మ్యాపింగ్ లేకపోవడం వల్ల సగానికి పైగా ఓటర్లు మళ్లీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మొత్తంగా 92.86 లక్షల మందికి నోటీసులు అందాయని పేర్కొన్నారు. నమోదైన మొత్తం ASDD కేసుల్లో ఒక్క హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 58.6% కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఆక్షేపణలు, ఫిర్యాదుల సమర్పణ గడువును ప్రస్తుతం ఉన్న సెప్టెంబర్ 16 నుంచి మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని సీఎం కోరారు. ఓటర్లకు నోటీసులు అందిన తర్వాత దానికి తగిన ఆధారాలతో సమాధానం ఇచ్చేందుకు కనీసం 3 నుంచి 4 వారాల వ్యవధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కు పరిస్థితి తెలిసేలా గ్రామసభలు, పురపాలక వార్డుల్లో కనీసం రెండుసార్లు ఓటర్ల జాబితాను బిగ్గరగా చదివి వినిపించాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో అర్హులైన ఓటర్లకు సహాయపడటానికి పోలింగ్ బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్లు సులభంగా పొందేలా మండల స్థాయిలో లభించే అధికారిక పత్రాలను కూడా సవరణల ధ్రువీకరణ కోసం ఆమోదించాలని లేఖలో ప్రస్తావించారు. విచారణల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అదనంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ERO) నియమించి, విచారణ సమయాన్ని ఓటర్ల సదుపాయానికి అనుగుణంగా వికేంద్రీకరించాలని లేఖలో స్పష్టం చేశారు.