బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ కి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో.. దళిత వర్గాలను మభ్యపెట్టేందుకు మీరు ప్రయోగించిన అస్త్రం ‘దళితుడినే ముఖ్యమంత్రిని చేయడం’.. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలోనూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి’ అని ప్రకటించారు.. కానీ ఆ తర్వాత వివిధ వేదికల ద్వారా ఈమాటను పదే పదే చెప్పారు అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Read Also: Rajinikanth: సూపర్ స్టార్ బర్త్ డేకి సరైన కమర్షియల్ సినిమా రీరిలీజ్…
ఇక, ‘కేసీఆర్ మాట చెబితే.. తల నరుక్కుంటాడు కానీ మాట తప్పను!’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన మీరు.. అధికారంలోకి రాగానే ఎందుకు మీ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తమాటలు చెప్పుకుని ప్రజలను మాయచేసే మీరు.. రాష్ట్రంలోని 20 శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర మీరు ఎలాచేయగలిగారు? అంటూ మండిపడ్డారు. ఇటువంటి మోసపూరిత ప్రతిజ్ఞలు చేసి.. ఇతర పార్టీలను తిప్పలు పెట్టానని మీకు మీరే సంబరపడ్డారు.. దీన్ని గొప్ప రాజకీయ చతురతగా మీ వాళ్లతో ప్రచారం చేయించుకున్నారు. తెలంగాణ దండోరా ఉద్యమాన్ని బలహీనం చేస్తూ.. దళితుల్లో లేనిపోని ఆశలు కల్పించిన మీ తీరు.. ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ రకమని తెలుసుకునేందుకు.. చాలా సమయం పట్టింది అని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.
Read Also: Aadhaar: ఆధార్ తీసుకుని పదేళ్లయిందా.. ఫ్రీ అప్ డేట్ మరి కొన్ని రోజులే
అయితే, ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజానీకం వాస్తవాలను గ్రహిస్తోంది అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. నాడు మీరు చెప్పిన మాటల్లోని కుటిల అర్థాన్ని అర్థం చేసుకుంటోంది.. దీన్ని మీరు మీ కుటుంబం జీర్ణించుకోవడం లేదు.. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు తొలి బీసీని అందిస్తామని చెబితే.. మీ సుపుత్రుడు ‘కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం’ అని ప్రకటించారు.. ఇది చాలదా మీ కుటుంబానికి బీసీల పట్ల.. అగౌరవానికి నిదర్శనం.. అలాగే.. ‘నాకు ఏ పదవులూ వద్దు, నేను తెలంగాణకు కాపలా కుక్క’లా ఉంటానని పదే పదే వల్లెవేసిన మీరు.. అధికారంలోకి రాగానే ‘మాది ఫక్తు రాజకీయ పార్టీ’ అని చెప్పి.. ‘కేసీఆర్ మాట, నీటి మూట’ అని నిరూపించారు.. మీ బిడ్డ కవితమ్మే బతుకమ్మ అన్నట్లు ప్రజల నెత్తులమీద బలవంతంగా పెట్టారు అని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: Mumbai : ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
అలాగే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆ బరువును దించకపోతే ఆమె తెలంగాణ ‘రెండో పవర్‌సెంటర్’ అయ్యేవారనడంలో ఎలాంటి సందేహం లేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ అంటూ వేలు విరిచిన చుట్టాలంతా రాష్ట్రంపై పడ్డారు.. అల్లుడు హరీశ్ రావు విషయంలోనైతే మీరు మింగలేక, కక్కలేక నెట్టుకొస్తున్నారు.. గత పార్లమెంటు ఎన్నికల్లో మీ ‘గుర్రం’ ఎగిరితే కనుక వారసత్వ పదవులతో తృప్తిపడే రాహుల్ గాంధీ వంటి వారి పక్కన కూర్చుని.. కేంద్ర ప్రభుత్వంలో పదవిని అలంకరిద్దామని అనుకున్నమాట వాస్తవం కాదా? మీ పుత్రరత్నంను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని ఆశపడ్డారు నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.