మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదుల దాడిని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్యగా అభివర్ణించారు.
‘‘మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. మహిళలపై దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో అనేకమందికి గాయపడ్డారు. ఈ దాడిలో గర్భిణీలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు దోషులను పట్టుకోకుండా, కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. దాడికి సంబంధించి వీడియోల్లో కనపడుతున్నా పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి. హత్యానేరం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
‘‘పోలీసుల కళ్ళెదుటే మతోన్మాదులు విచక్షణ కోల్పోయి హిందూ మహిళలపై, పిల్లలపై దాడి చేస్తున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారు. ఓ వైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా.. దాడులు జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. స్లాట్ హౌస్ ఏరియాలో మజ్లిస్ పార్టీ అండతో మతోన్మాదులు మాఫియాగా ఏర్పడి రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలింతలు అని చూడకుండా గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. బాధిత గిరిజన మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్‌గా నామమాత్రంగా ట్రీట్ మెంట్ ఇస్తారా..? హిందువుల పట్ల గూండాలు చేసిన దాడిని నిలువరించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు.’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హిందూ మహిళలపై జరిగిన దాడి విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. బాధితులకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడుతాం. ఓ వైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పేద మహిళలపై దాడులు జరుగుతుంటే ఎందుకింత వివక్షంగా వ్యవహరిస్తోంది..? బాధితులకు మేం అండగా ఉంటాం.. అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. మహిళలు, పేదల రక్షణ ముఖ్యం. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి.. వాటిని పేదవారికి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి, మాఫియాకు చెందినవారికి కేటాయించారు.’’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.