NTV Telugu Site icon

Telangana Elections: నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర.. మూతపడనున్న మైకులు

Whatsapp Image 2023 11 28 At 8.04.26 Am

Whatsapp Image 2023 11 28 At 8.04.26 Am

Telangana Elections: రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తుతున్న అభ్యర్థుల మైకులు మూగబోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు బయలు దేరారు. జెండాలు పట్టుకుని ఊరువాడ అదిరే రీతిలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ప్రచార గడువు ముగియగానే నియోజకవర్గాల నుంచి స్థానికేతర నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని ఓటర్లను వేడుకున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2298 మంది పోటీ చేసి తమ శక్తియుక్తులను వినియోగించి ప్రజల మద్దతును కోరారు.

Read Also:CM KCR: నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేశారు.

Read Also:Health Tips : శరీరంలో వేడిని తగ్గించే జ్యూస్ ఇదే.. ఎలా తయారు చెయ్యాలంటే?