Land For Jobs Scam: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తేజస్వి, లాలూ యాదవ్ ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలలో ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. జూన్ 23న పాట్నాలో జరిగిన 16 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: Professor Fired: క్లాస్‌లోనే బట్టలు విప్పేయమన్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
2004 -2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ డి స్థానాల్లో వివిధ వ్యక్తులను నియమించారని, దానికి బదులుగా సంబంధిత వ్యక్తులు తమ భూమిని లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఏజెన్సీలు ఆరోపించాయి. ఈ నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదా పబ్లిక్ నోటీసు జారీ చేయలేదని, అయితే ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో పాట్నా నివాసితులు కొంతమందిని ప్రత్యామ్నాయంగా నియమించారని సీబీఐ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ మార్చిలో ప్రశ్నించింది. ఈ కేసులో గత ఏడాది దాఖలు చేసిన చార్జిషీట్‌లో దంపతులు, వారి కుమార్తె మిసా భారతి పేరు కూడా ఉంది.
మొదటి ఛార్జిషీట్ సమర్పించిన తర్వాత వచ్చిన పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా తాజా ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌తోపాటు పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ పేర్కొంది.