రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి కొందరు వ్యక్తులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదాన్ని నింపింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కనిష్క్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న కనిష్క్ రెడ్డి చిన్నతనంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.