Swiggy AI Update: ఇకపై ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయాలన్నా, కిరాణా సామాగ్రి తెప్పించుకోవాలన్నా వేర్వేరు యాప్‌లలో గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఏఐ (AI) అసిస్టెంట్‌కు “నాకు ఈ కర్రీ కావాలి” అని చెబితే చాలు.. పదార్థాల ఎంపిక నుంచి పేమెంట్ వరకు అంతా అదే చూసుకుంటుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, కృత్రిమ మేధ సాయంతో వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసే భారీ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
ఏమిటీ ఎంసీపీ (MCP) అంటే మ్యాజిక్..
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (MCP) అనే సరికొత్త ఓపెన్ సోర్స్ సాంకేతికతపై స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ సేవలను అనుసంధానించింది. దీనివల్ల చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ నేరుగా స్విగ్గీ సర్వర్లతో అనుసంధానమవుతాయి. దీంతో మీరు ఏ ఏఐ అసిస్టెంట్‌ని వాడుతున్నా.. అక్కడి నుంచే స్విగ్గీలోని 40 వేల కంటే ఎక్కువ ఉత్పత్తులను యాక్సెస్ చేయవచ్చు.
అడగడమే ఆలస్యం..
సాధారణంగా మనం యాప్‌లోకి వెళ్లి వెతకడం, ట్యాప్ చేయడం వంటివి చేస్తాం. కానీ ఈ కొత్త విధానంలో.. అడగడమే ఆలస్యం. ఉదాహారణకు “ఈ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది.. స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేయి” అని చెబితే, ఏఐ మీ అభిరుచులకు తగ్గ బ్రాండ్లను ఎంచుకుని కార్ట్‌ను సిద్ధం చేస్తుంది. అలాగే మీ డైట్ ప్లాన్ చెబితే, దానికి తగిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే ఏఐ సిఫార్సు చేస్తుంది. దీంతో మీరు కేవలం ఆహారమే కాదు, ‘డైన్‌అవుట్’ ద్వారా మీకు నచ్చిన రెస్టారెంట్‌లో టేబుల్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సేవలపై స్విగ్గీ సీటీఓ (CTO) మధుసూధన్ రావు మాట్లాడుతూ.. “భారతీయ వినియోగదారులు డిజిటల్ సేవల విషయంలో చాలా వేగంగా మారుతున్నారు. యాప్ నావిగేషన్ కంటే సంభాషణల ద్వారా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ఎంసీపీ సాంకేతికత భారతదేశ వాణిజ్య రంగంలోనే ఒక మైలురాయి” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత మీల్ ప్లానింగ్ వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఎలా ప్రారంభించవచ్చు అంటే..
మీకు నచ్చిన ఏఐ టూల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అక్కడ ‘కనెక్టార్స్’ విభాగంలో స్విగ్గీ ఎంసీపీ (Swiggy MCP) యుఆర్‌ఎల్ (URL)ను జోడించడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీనివల్ల గోప్యత, భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా, చాట్ బాక్స్ నుంచే మీ ఆర్డర్లను ట్రాక్ చేయవచ్చు.
READ ALSO: IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?