తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు స్వయంగా తమ అభిమాన క్రికెటర్లను వీక్షించే అవకాశం ఉంటుంది.
శ్రీలంక టూర్ షెడ్యూల్
జనవరి 3 నుంచి 15 వరకు శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 3న ముంబైలో తొలి టీ20, జనవరి 5న పూణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతాయి. జనవరి 10న గౌహతిలో తొలి వన్డే, జనవరి 12న కోల్‌కతాలో రెండో వన్డే, జనవరి 15న త్రివేండ్రంలో మూడో వన్డే జరగనున్నాయి.

న్యూజిలాండ్ టూర్ షెడ్యూల్
శ్రీలంకతో సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. జనవరి 18న హైదరాబాద్‌లో తొలి వన్డే, జనవరి 21న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, జనవరి 24న ఇండోర్‌లో మూడో వన్డే జరుగుతాయి. జనవరి 27న రాంచీలో తొలి టీ20, జనవరి 29న లక్నోలో రెండో టీ20, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో మూడో టీ20 జరుగుతాయి.

ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్
న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలలో టీమిండియా తలపడనుంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు ఆస్ట్రేలియా పర్యటన కొనసాగనుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగపూర్ వేదికగా తొలి టెస్ట్, ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్, మార్చి 1 నుంచి 5 వరకు ధర్మశాల వేదికగా మూడో టెస్ట్, మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతాయి. మార్చి 17న ముంబైలో తొలి వన్డే, మార్చి 19న విశాఖలో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి.

