Mohammed Shami nominated for Arjuna Award: భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నామినేట్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. భారత గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ సిఫార్సు చేసిందట. వాస్తవానికి అర్జున జాబితాలో ముందుగా షమీ పేరు లేకున్నా.. బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పరిగణనలోకి తీసుకున్నారట.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్‌కు చేరడంలో మహమ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు. మెగా టోర్నీ మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడని షమీ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముందు హార్దిక్ పాండ్యా గాయపడి జట్టుకు దూరమవడంతో అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఆడిన మొదటి మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుని.. అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆపై షమీ వెనుదిరిగి చూడలేదు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో ఫైవ్ వికెట్ హాల్ పడగొట్టాడు. మెగా టోర్నీలో షమీ అత్యుత్తమ ప్రదర్శన న్యూజిలాండ్‌పై (7/57) చేశాడు.
Also Read: Smitha Sabharwal: ఆ వార్తలు అవాస్తవం.. ఐఏఎస్‌గానే విధులు నిర్వహిస్తా: స్మితా సభర్వాల్
దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నకు బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఎంపికైనట్టు తెలిసింది. నిజామాబాద్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. చెస్ క్రీడాకారిణి ఆర్ వైశాలి, పారా ఆర్చర్ శీతల్ దేవి, ఆర్చర్ అదితీ సహా మొత్తం 18 మంది క్రీడాకారులను అర్జున పురస్కారానికి నామినేట్ చేశారట. అవార్డులకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర క్రీడాశాఖ త్వరలోనే ప్రకటించనుంది.