Teacher Kidnap Incident: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మునీర్ అహ్మద్ అనే టీచర్ క్లాస్ రూమ్‌లో ఉండగా ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. టీచర్‌ను తీసుకెళ్లింది పోలీసులని నిర్ధారణ అయింది. సీఐ పిలుస్తున్నాడని బలవంతంగా కారులో తోసుకుని ఇద్దరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారు. టీచర్ మునీర్‌తో పాటు సోదరుడు రిటైర్డ్ బ్యాంకు అధికారి మక్బుల్‌ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఇద్దరిని కర్నూలు శివారు జిల్లా ట్రైనింగ్ సెంటర్‌లో వేర్వేరు బ్యారక్‌లలో 11గంటల పాటుల పోలీసులు నిర్బంధించారు. టీచర్‌ను తీసుకెళ్లింది పోలీసులని రాత్రి 10 గంటల వరకు తెలియక కుటుంబ సభ్యుల ఆందోళనకు గురయ్యారు. త్రీటౌన్ పీఎస్‌కు వెళ్లి తన భర్త ఆచూకీ చెప్పే వరకు వెళ్లేది లేదని బీష్మించడంతో రాత్రి 11 గంటలకు టీచర్‌ను పోలీసులు వదిలేశారు. రూ.20 కోట్లు విలువ చేసే భూవివాదంలో సెటిల్‌మెంట్ లో భాగంగా తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించారు. గత సెప్టెంబర్ నెలలోనూ స్కూల్‌కు వెళ్తుండగా మునీర్ అహ్మద్‌ను మధ్యలో కారు ఆపి పోలీసులు తీసుకెళ్లారు. భూవివాదంలో తనను పోలీసులు వేధిస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ ఆరోపించారు.
Read Also: High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
వందేళ్లుగా తమ తాతల నుంచి వచ్చిన ఆస్తి రాసివ్వాలని, ఇచ్చినంత తీసుకొని స్థలం అమ్మినట్టు రిజిస్టర్ చేయాలని బెదిరిస్తున్నారని టీచర్ మునీర్ తెలిపారు. కడప జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి బెదిరిస్తున్నారని, పోలీస్ అధికారులు ఆయనకు ముద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. డీఐజీ కూడా పిలిపించి భూ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారని టీచర్ చెప్పుకొచ్చారు. భూమి వారికి ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు, ఇపుడు మట్కా నిర్వహకులతో సంబంధాలు ఉన్నాయని విచారిస్తున్నారని పేర్కొన్నారు. తనకు, తన భార్యకు, తన కూతురు ప్రాణాలకు ప్రమాదం ఉందని టీచర్ మునీర్ భయాందోళనను వ్యక్తం చేశారు. 2016 నుంచి అనేకసార్లు టీచర్ మునీర్ ను భూవివాదంలో పిలిపించి పోలీసులు విచారించినట్లు చెప్పారు. భూమి ఊరికే ఇవ్వద్దు …డబ్బులు ఇస్తామంటున్నారు…ఇవ్వడానికేమి అంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను కాపాడాలని టీచర్ మునీర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఏమైనా జరిగితే కడప జిల్లా కు చెందిన విష్ణు, కర్నూలుకు చెందిన ధనుంజయ, వారికి సపోర్ట్‌గా వుంటూ వేధించిన వారిదే బాధ్యత అని టీచర్ మునీర్ అన్నారు. వందేళ్ల మా తాతల నుంచి వచ్చిన భూమిని రాజకీయ నాయకుల ఒత్తిడితో రికార్డులు మార్చారని ఆరోపించారు.