NTV Telugu Site icon

CM Revanth Reddy : రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌ తదితర ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సహా ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జి మంత్రులు రంగంలోకి దిగారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చుతున్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పోటీ చేయకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌ ఒకే గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తుండగా, బీజేపీ మాత్రం మూడు స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గత వారం రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి అన్ని జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్‌, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, రఘునందన్‌ రావు, అరవింద్‌ తదితరులు కూడా వివిధ ప్రాంతాల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య దేశం పాకిస్థాన్ ఔట్..

ప్రస్తుతం మూడు స్థానాల్లోనూ బీజేపీకి విజయం లేనప్పటికీ, ఈసారి గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్‌ బన్సల్‌ సీనియర్‌ నేతలతో సమీక్షలు నిర్వహించి, ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అనుబంధ విభాగాలను కూడా రంగంలోకి దింపి ప్రచారం ముమ్మరం చేశారు.

కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మంత్రులు శ్రీధర్‌ బాబు, దామోదర్‌ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క, జూపల్లి కొండా సురేఖలను ప్రచారానికి వినియోగిస్తోంది. పీసీసీ ఆధ్వర్యంలో భారీ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఇక టీచర్‌ సంఘాలు తమ అభ్యర్థుల గెలుపు కోసం చివరి క్షణాల్లో ప్రచారం ముమ్మరం చేశాయి. మంగళవారమే ప్రచారానికి తుది గడువు కావడంతో, సెలవులు పెట్టి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేపట్టారు. తమ అభ్యర్థుల గెలుపు వల్ల వచ్చే ప్రయోజనాలను ఓటర్లకు వివరిస్తూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే, మద్దతు ఉన్నా ఓటింగ్‌ రోజున ఆ మద్దతు ఓటుగా మారుతుందా? అనే అనుమానం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.

Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన పడవద్దు