Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్‌తో సమిష్టిగా పోరాడాలని నిర్ణయించామన్నారు. విడివిడిగా పోటీ చేస్తే దశాబ్ధాలైనా ఇదే అరాచకం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ తాను నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది మా ఇద్దరి భవిష్యత్ కోసం కాదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పేర్కొన్న పవన్.. బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. మీకు యుద్ధమే కావాలంటే, మేమూ యుద్ధమే చేస్తామంటూ తన విధానాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ యుద్ధమే కావాలనుకుంటే, మేము రెడీ అని పవన్ వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలిసి వస్తుందని అనుకుంటున్నామని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటే..
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే పొత్తు తప్పదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని పోతామన్నారు. వైసీపీ సర్కారు వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ బాగా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. వైఎస్ జగన్‌కు ఇంకా ఆరు నెలల సమయమే ఉందన్నారు. ఈ ఆరు నెలల్లో వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన-టీడీపీ కలిసే పోటీ చేస్తాయన్నారు. చంద్రబాబుతో ములాఖత్‌లో రాజకీయ పరమైన అన్ని విషయాలు చర్చకు వచ్చాయన్నారు. రేపటి నుంచే టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఈ అంశంలో బీజేపీ కలిసి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం వద్ద తాను ఈ పొత్తుల అంశాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీది ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
జగన్ ఆర్ధిక నేరస్తుడని, వైసీపీకి మద్దతు తెలిపే నేరస్థులను అస్సలు వదలమని పవన్ పేర్కొన్నారు. అధికారులు మీ చర్యలు.. మీకే డేంజర్ అంటూ పవన్ హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ బానిసత్వంలో ఉందని ఆయన ఆరోపించారు. జగన్‌ను నమ్ముకున్న నాయకులంతా ఆలోచించుకోండని.. అక్రమాలకు పాల్పడిన వారిని ఏ ఒక్కరినీ వదలమన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని… దీనికి బీజేపీ మద్దతుగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ములాఖత్‌లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు అడిగి, తెలుసుకున్నామని, వయస్సు రీత్యా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నామని పవన్ తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని చూసి, దీని రూపకర్త చంద్రబాబుకి ఇలాంటి పరిస్థితి ఏమిటని బాధేసిందన్నారు.