Rajahmundry Rural Seat: రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి టికెట్ తనకేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చెబుతుండగా.. కాదు తనకు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. ఇక, రాజమండ్రిలో పవన్ టూర్ తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య రచ్చ స్టార్ట్ అయింది. ఈ ఫైటు ఇలా జరుగుతున్న వేళ బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ తో మరింత పొలిటికల్ హీట్ పెరిగింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన కూడా రాజమండ్రి రూరల్ లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. అక్కడ్నించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి సీటుపై రెండు పార్టీల నేతలు తగ్గేదేలే అంటున్నారు.
అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ( మంగళవారం ) రాజమండ్రి టూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అని ఆయన క్లారిటీ ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ వెల్లడించారు. తనను ఇక్కడ్నించే పోటీ చేయమని పవన్ ఆదేశించారని దుర్గేష్ తెలిపారు. ఇక, ఈ విషయంపై టీడీపీ అధిష్టానంతో పవన్ మాట్లాడారని తాము భావిస్తున్నామని జనసైనికులు అనుకుంటున్నారు. ఇక, రాజమండ్రి రూరల్ సీటుపై జరుగుతున్న ప్రచారం ఊహాజనితం మాత్రమే అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో కచ్చితంగా రూరల్ సీటు నుంచి పోటీలో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం!
ఇక, టీడీపీ- జనసేన పార్టీల మధ్య రాజమండ్రి రూరల్‌లో టికెట్ పెట్టిన చిచ్చుతో ఇంతకీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది జనసేనా? టీడీపీనా? బరిలో నిలిచేది బుచ్చయ్యా? దుర్గేషా అనే విషయం తెలియక రెండు పార్టీలకు చెందిన కేడర్ సతమతమైపోతోంది. ఇక, తన సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు చంద్రబాబును కలిసేందుకు బుచ్చయ్య చౌదరి ప్రయత్నిస్తున్నారు. అసలు గోరంట్లకు తెలిసే ఇదంతా జరుగుతోందా అనే అనుమానాలు టీడీపీ కార్యకర్తల్లో కలుగుతున్నాయి. పవన్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్ చెప్పడంతో సైకిల్ సైన్యంలో కలవరాన్ని మరింత పెంచినట్లైంది. అయితే, ఇప్పుడు బుచ్చయ్య చౌదరి ముందున్న దారేంటి అనేదానిపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.