Pemmasani Chandrashekar: ‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మూడో వార్డులో గల ఏకలవ్య నగర్‌లో స్థానికులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. సంక్షేమం పేరిట రూ. 5-10 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదన్నారు. ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం గానీ, సమాజంగానీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన తెలిపారు.
అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజాస్వామ్యం హక్కు కల్పించిందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో చేతివృత్తులు, వృత్తిపై ఆధారపడి బతికే వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల జీవనోపాధికి ఉపయోగపడేలా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు లీలా శంకర్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు గోపీచంద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
ఘనస్వాగతం పలికిన ప్రజలు
అనంతరం తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు, అత్తోట గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని గురువారం నిర్వహించారు. దారి పొడవునా ప్రజలంతా పూలవర్షంతో ఇరువురు నాయకులకు స్వాగతం పలుకగా, పలుచోట్ల భారీ గజమాలతో, హారతులు పడుతూ నాయకులను కార్యకర్తలు గౌరవించారు. ప్రజలను కలుస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూనే నాయకులు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా ప్రచారం ముగింపు సభలో భాగంగా అత్తోటలో పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 500 రీచ్‌లను అక్రమంగా తవ్వినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు. ఇసుక తవ్వితే సహజ వనరుల అక్రమ రవాణా మాత్రమే గాక భూమిలోకి ఉప్పునీరు పూర్తిగా ఇంకిపోయి, పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే పవన్ అంటే ఆయనకు వ్యక్తిగత అభిమానం ఉందని, బీజేపీతో పొత్తు పవన్ చొరవేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పవన్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తికి ఆవేశం కాకుండా, వైసీపీ నాయకుల్లా నక్కజిత్తులు ఉండాలా? అని ఓ ప్రశ్నకు సమాధానంగా పెమ్మసాని సమాధానం ఇచ్చారు.
రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న పెమ్మసాని
గురువారం రంజాన్ పర్వదినం సందర్భంగా గుంటూరులోని ఉర్దూ స్కూల్, ఆంధ్ర ముస్లిం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.