Site icon NTV Telugu

Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు

Nellore

Nellore

Nellore Politics: నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు బాబు-ఆనం భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఆయనను టీడీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నెల 13 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. లోకేష్ పాదయాత్ర నాటికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం చేరికపై క్లారిటీ రానుంది. నెల్లూరులో లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ఆనం వివేకా కుమారుడు ఆనం రంగమయూరి రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం.

Read Also: MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనం రాంనారాయణరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన అనంతరం ఏ పార్టీలో చేరతారనే సందేహం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలను గమనిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కీలక నేతలు ఆనం, కోటంరెడ్డిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి.

Exit mobile version