టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ హరిచందన్‌ను గురువారం సాయంత్రం టీడీపీ నేతల బృందం కలిసింది. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజీని కూడా గవర్నర్ కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ముందు తాము పలు డిమాండ్లను ఉంచామని ఆయన తెలిపారు. దాడుల అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరామన్నారు. తమ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని రాష్ట్రపతి దగ్గరకు కూడా తీసుకువెళ్తామని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీని అణిచివేయాలని తమ నేతలపై రెండేళ్ళుగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్ధిక మూలాలు దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.