Chintamaneni Prabhakar: దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్‌లో చేసిన హల్‌చల్‌తో చింతమనేని ప్రభాకర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు. దీంతో చింతమనేనితో పాటు ఆయన అనుచరులు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో పోలీసులకు పట్టుబడకుండా చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 13న పోలింగ్ రోజున పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో రాజశేఖర్‌ను పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. తన అనుచరులతో కలిసి వెళ్లి పోలీసులతో గొడవపడ్డారు. నిందితుడిన తన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సీఐ వారించినా ఏ మాత్రం తగ్గకుండా దురుసుగా ప్రవర్తించారు చింతమనేని ప్రభాకర్. ఈ కేసులో చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపారు పోలీసు అధికారులు.
Read Also: SIT Investigation on Violence: వేగం పెంచిన సిట్.. నేడు కొలిక్కి వచ్చే అవకాశం!
పెదవేగి స్టేషన్ సిబ్బంది కస్టడీలో ఉన్న నిందితుడిని తీసుకువెళ్లిన ఘటనలో చింతమనేని త పాటు 18మందిపై కేసులు నమోదు అయ్యాయని నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య వెల్లడించారు. చింతమనేనితో పాటు నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు కొనసాగుతోందన్నారు. దెందులూరు సమస్య తన ప్రాంతం కాబట్టి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ.. గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. రౌడీ షీటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతించం.. ఏజెంట్లుగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కౌంటింగ్ తర్వాత క్రాకర్స్ కాల్చకుండా, పెట్రోల్ బాటిల్స్ లో అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.