ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది. రాజకీయ.. వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ. తన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ పరిశీలనకు టీటీడీ పాలకమండలి సభ్యత్వం అడ్డమైతే దాన్ని వదులుకోవడానికి సిద్ధం అని అధిష్టానానికి జంగా కృష్ణమూర్తి చెప్పారు. ఏడాది సభ్యత్వం ఉండగానే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశానని, ఎమ్మెల్సీ అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. యాదవ సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా పేర్ల పరిశీలన జరుగుతోంది.
కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా.. ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. 8,9 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో అవకాశం లేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. అయినా టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది.