Chandrababu: భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం నడుస్తోంది.. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుండగా.. విపక్షాలు ఈ వేడుకకు దూరంగా ఉన్నాయి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.. ఇప్పటికే 21 ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన ఆయన.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు.. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రానికి అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన మార్పులు చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని ఆకాక్షించారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశం ఏర్పాటుకు కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని ఆకాక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
Read Also: Andhra Pradesh: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..
మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ కూడా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.. ‘‘పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం.. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని పొలిటికల్ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నా.. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షంతో పాటు.. విపక్షం కూడా కొత్త పార్లమెంట్ భవన ప్రారంబోత్సవాన్ని స్వాగతించాయి.