Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ పిటిషన్‌లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో, సుప్రీంకోర్టులో రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: Purandeshwari: మద్యం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. ఇక, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో రేపు తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. మరి చంద్రబాబుకు ఈ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందో, లేదోనని అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ప్రధానంగా అందరికీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనే ఉత్కంఠ ఉంది. సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి.. ఎలాంటి తీర్పు వస్తుందని అందరిలో ఆసక్తి పెరిగింది.