TCS CEO: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్‌ను ఇన్‌చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఆయన రాజీనామాకు గల కారణాలు బయటకు తెలియరాలేదు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజేశ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే రాజేశ్ గోపీనాథన్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్‌లోనే కొనసాగుతారని, తదుపరి సీఈఓకు మార్గనిర్దేశనం చేస్తారని సంస్థ వెల్లడించింది. ఇక టీసీఎస్ సంస్థకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెస్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్ టీసీఎస్ సీఈఓగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి ఇటీవలే రాజీనామా చేసి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమైన నాలుగు రోజుల్లోనే టీసీఎస్ సీఈఓ అండ్ ఎండీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
గోపీనాథన్ టీసీఎస్‌లో దాదాపు 22 ఏళ్లపాటు సేవలందించారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. అయితే, వచ్చే సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీలో సేవలు అందించనున్నారు. ఆయన స్థానంలో కృతివాసన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన పూర్తి స్థాయి సీఈవోగా నియామకం కానున్నారు. కాగా.. టీసీఎస్ సంస్థ సీఈఓగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. సంస్థలో తనది 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారు. తన నేతృత్వంలో సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తదుపరి ఏం చేయాలనే విషయమై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నారు. రాజీనామా విషయమై సుదీర్ఘంగా ఆలోచించి. ఛైర్మన్‌తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో చర్చించాకే తప్పుకోవాలని నిర్ణయించానన్నారు.