IPL Title Sponsor is Tata Group: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా భారత దిగ్గజ సంస్థ ‘టాటా గ్రూప్’ కొనసాగనుంది. వచ్చే 5 ఏళ్ల కాలానికి స్పాన్సర్‌షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. 2024 నుంచి 2028 వరకు రూ. 2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. టాటా కంపెనీ ఏడాదికి రూ. 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కో సీజన్‌కు రూ.500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు నిరాశే ఎదురైంది.
Also Read: PKL 10: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ విజయం.. ప్రత్యేక ఆకర్షణగా కావ్య థాపర్!
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ 2023 డిసెంబర్ 12న టెండర్‌ను జారీ చేసింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం జనవరి 14న ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 2500 కోట్లకు బిడ్ చేసింది. టాటా గ్రూప్ గతంలో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ఒక్కో సీజన్‌కు రూ. 365 కోట్లు చెల్లించింది. ఒక్కో సీజన్‌కు రూ. 500 కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్పాన్సర్‌షిప్ హక్కులను గెలుచుకునే దిశగా దూసుకుపోయింది. అయితే రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించిన టాటా గ్రూప్ బిడ్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధికం. మహిళల లీగ్‌కు కూడా టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది.