బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మైదానంలోనే కుప్పకూలాడు. సోమవారం సావర్‌లో జరిగిన ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతున్న 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్బాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్బాల్ గుండెపోటు వచ్చినట్లు బీసీబీ చీఫ్ ఫిజీషియన్ దేబాషిష్ చౌదరి ధృవీకరించారు.
డీపీఎల్ 2025లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు తమీమ్ ఇక్బాల్ నాయకత్వం వహిస్తున్నాడు. షైన్‌పుకుర్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇక్బాల్‌కు ఛాతీలో నొప్పిరావడంతో మైదానంలోనే కుప్పకూలాడు. మైదానంలో వైద్య సహాయం అందించిన తర్వాత హెలికాఫ్టర్‌లో ఢాకాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో అతడికి ఛాతీలో నొప్పి ఎక్కువవడంతో.. వెంటనే ఫజిలతున్నేసా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇక్బాల్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
‘స్థానిక ఆసుపత్రిలో తమీమ్ ఇక్బాల్‌కు ప్రాథమిక పరీక్షలు జరిగాయి. గుండె సమస్యలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇక్బాల్‌ను ఢాకాకు తరలించడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ.. హెలిప్యాడ్‌కు తీసుకెళ్లే మార్గంలో అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే వెనక్కి తీసుకువచ్చాము. తీవ్రమైన గుండెపోటు అని వైద్య నివేదికలు నిర్ధారించాయి’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబాషిష్ చౌదరి తెలిపారు. జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తమీమ్.. స్థానిక మ్యాచ్‌లు ఆడుతూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.