MP Gopinath : గత నెలలో దేశం మొత్తం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు గోపీనాథ్. ఇక నేడు జరిగిన పార్లమెంటు సమావేశంలో 40 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమిళనాడు ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో మొదటగా కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత కాంగ్రెస్, డిఎంకే సహా కూటమికి సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసేసారు.
AP TET Results: ఏపీ టెట్-2024 ఫలితాలు విడుదల
ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా క్రిష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకొని ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశాడు. చివర్లో తమిళంలో థాంక్యూ.. జై తమిళనాడు.. అని మాట్లాడారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికైన ఆయన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు పలు అంశాలపై గోపీనాథ్ తెలుగులోనే అసెంబ్లీలో మాట్లాడారు. ఇదివరకు తమిళనాడు అసెంబ్లీలో గోపీనాథ్ తెలుగులో అడిగిన ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత కూడా తెలుగులోనే సమాధానం ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.