Helmet Awareness in Thanjavur: హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలను బంగారం వరించింది. అంతేకాదు చీర కూడా లభించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటారా?.. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో. బంగారం, చీర అందుకున్న మహిళలు తెగ సంబరపడిపోయారు. ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలపై వెళ్తున్న 50 మంది మహిళలకు బంగారు నాణేలు, చీరలను కానుకలుగా అందజేశారు. హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సదరు మహిళలను కోరారు.
తంజావూరు పట్టణంలోని రాజా మిరాసుధార్ ఆసుపత్రి రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించి వచ్చిన కొందరు మహిళలను ఆపారు. తాము నిబంధనల ప్రకారం హెల్మెట్‌తో వచ్చామని, ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఇంతలో అమ్మవారి వేషం ధరించి, చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న పాఠశాల విద్యార్థినితో కలిసి తంజావూర్ జ్యోతి ఫౌండేషన్ కార్యదర్శి ప్రభురాజ్ కుమార్, నగర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవిచంద్రన్ అక్కడికి వచ్చారు. ఆ మహిళలకు అరగ్రాము బంగారు నాణెం, చీర అందించారు. తోటి వారికి కూడా హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
Also Read: Big Breaking: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు!
ఊహించని కానుకలకు మహిళలు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కొందరు మహిళలు అయితే ఆనందంతో తబ్బిబైపోయారు. ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలపై వెళ్తున్న 50 మంది మహిళలకు బంగారు నాణేలు, చీరలు ఇచ్చినట్లు తంజావూర్ జ్యోతి ఫౌండేషన్ కార్యదర్శి ప్రభురాజ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.