NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా.. మంత్రి బర్తరఫ్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్‌!

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్‌ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్‌ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది. తదుపరి సమాచారం వచ్చే వరకు తొలగింపు ఉత్తర్వులను నిలిపివేయాలని గవర్నర్ అర్థరాత్రి నిర్ణయించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కూడా తెలియజేశారని సమాచారం.

Also Read: Uniform Civil Code: మోడీ సర్కారు సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లోనే యూసీసీ బిల్లు!

మనీలాండరింగ్ కేసులో నిందితుడైన వి.సెంథిల్ బాలాజీని గవర్నర్ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల కోసం నగదు తీసుకోవడం, మనీలాండరింగ్ సహా పలు అవినీతి కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించారని తమిళనాడులోని రాజ్ భవన్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఐదు గంటల వ్యవధిలో గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండు వారాల క్రితం అరెస్టయిన బాలాజీ ప్రస్తుతం ఉద్యోగాలకు నోటు కేసులో జైలులో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆయనను శాఖ లేని మంత్రిగా కొనసాగించారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ రవి ఏకపక్షంగా రద్దు చేశారు.

Also Read: UPI Payments: పెరిగిన యూపీఐ చెల్లింపులు.. నెరవేరనున్న 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల

గవర్నర్ పై సీఎం స్టాలిన్ ఫైర్
ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్‌ సర్కార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్‌ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.