Site icon NTV Telugu

Taapsee pannu : ప్రతి డైరెక్టర్ అదే మాట.. నా మీద నాకే అసహ్యం వేసింది

Tapsee

Tapsee

అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో తాప్సీ ఒకరు. 2010లో ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, ఆ తర్వాత బాలీవుడ్ లో ‘పింక్’, ‘తప్పాడ్’, ‘బద్లా’ వంటి సినిమాలతో తనలోని నటిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, పాత్ర కోసం ఎంతటి సవాళ్లనైనా స్వీకరించే పట్టుదల ఆమెను పవర్‌ఫుల్ లేడీగా నిలబెట్టాయి. నటనలోనే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది తాప్సీ. అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికి బాడీ షేమింగ్ అనేది కామన్. అలాగే తాప్సీ కూడా కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఏదురుకుందట.

Also Read : Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన ప్రియాంక.. ఒక్కసారిగా హీటెక్కిన సోషల్ మీడియా!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ , సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ మరియు వివక్ష గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనకున్న సహజమైన రింగుల జుట్టు (Curly Hair) వల్ల చాలా మంది దర్శకులు తనను గ్లామర్ పాత్రలకు పనికిరావని తిరస్కరించేవారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల వారిని చూసి, నా జుట్టు ఎందుకు ఇలా ఉంది అని తనని తానే అసహ్యించుకునే స్థితికి చేరుకున్నానని ఆమె నిజాయితీగా చెప్పుకొచ్చింది.

దర్శకులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద హెయిర్ బ్రాండ్లు కూడా తన రింగుల జుట్టు తో యాడ్స్ చేయడానికి నిరాకరించేవని, షూటింగ్ సమయంలో జుట్టును స్ట్రెయిట్ చేయాలని కండిషన్ పెట్టేవారని తాప్సీ తెలిపారు. గ్లామర్ అంటే కేవలం ఒకే రకమైన లుక్ అని నమ్మే ఈ ధోరణి తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. అయితే, కాలక్రమేణా తన సహజ రూపాన్ని తాను ప్రేమించడం మొదలుపెట్టానని, ఇప్పుడు అదే రింగుల జుట్టు తన ఐడెంటిటీ గా మారిందని ఆమె గర్వంగా చెప్పారు. ఇతర మహిళలు కూడా ఎవరో మెచ్చుకోవాలని కాకుండా, తమ సహజ సిద్ధమైన అందాన్ని ప్రేమించాలని తాప్సీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Exit mobile version