సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ (72) కన్నుమూశారు. కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కేన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంతలోనే ఆయన మరణవార్త బీజేపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సుశీల్ మోడీ మృతి పట్ల ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1952, జనవరి 5న సుశీల్ కుమార్ మోడీ జన్మించారు. 2005 నుంచి 2020 వరకు బీహార్ ఆర్థిక మంత్రి, మాజీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 7, 2020లో బీహార్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. సుశీల్ మోడీకి భార్య, ఇద్దరు సంతానం. పాట్నా యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు.
సుశీల్ మోడీ మన మధ్య లేరని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఎక్స్‌లో వెల్లడించారు. బీజేపీ కుటుంబం.. మంచి నాయకుడ్ని కోల్పోయిందన్నారు. రాజకీయ అంశాలపై లోతైన జ్ఞానం కలిగి ఉన్నారని గుర్తుచేశారు. ఈ దు:ఖ సమయంలో ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని… అలాగే ఆయన ఆత్మకు శాంతిని ఇవ్వాలని సిన్హా ప్రార్థించారు.
2024 ఎన్నికల స్టార్ క్యాపెయినర్ లిస్టులో సుశీల్ మోడీ పేరు కూడా ఉంది. అయితే తనకు కేన్సర్ ఉందని ఏప్రిల్ 3న ఆయన స్వయంగా ప్రకటించారు. ఆరు నెలల క్రితమే కేన్సర్ బయటపడిందని చెప్పారు. ఈ విషయం ప్రధాని మోడీకి చెప్పానని.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని ఆయన తెలిపారు.
సుశీల్ మోడీ మృతి పట్ల బాలీవుడ్ నటి, మండీ బీజేపీ అభ్యర్థి కంగనౌ రనౌత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం బీహార్‌లో సుపరిపాలనకు శకానికి హామీ ఇచ్చిందని ఎక్స్‌లో పోస్టు చేశారు.