Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!

Surat

Surat

Cyber Crime: 11వ తరగతిలోనే చదువు స్వస్తి చెప్పిన ఒక 18 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా రూ. 64 కోట్లకు పైగా డిజిటల్ దోపిడీకి స్కెచ్ వేసి దేశవ్యాప్తంగా సైబర్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలిగ్రామ్ వేదికలుగా నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన మొబైల్ యాప్‌లను (Malicious APKs) తయారు చేస్తూ సైబర్ నేరగాళ్ల ముఠాలకు విక్రయిస్తున్న రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే మాస్టర్‌మైండ్‌ను గుజరాత్‌లోని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. చదువు మధ్యలోనే ఆపేసినా, రోహిత్ తన 16 ఏళ్ల వయసులోనే కోడింగ్‌లో నిపుణుడిగా మారి, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, అమరికన్ ఎక్స్‌ప్రెస్, పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పోర్టళ్లు, బిగ్‌బాస్కెట్, ఆధార్ వంటి సేవలను పోలిన నకిలీ యాప్‌లను తయారు చేయడం మొదలుపెట్టాడు.

ఈ సైబర్ దందా వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం ఉంది. జార్ఖండ్‌లోని జామ్‌తారా, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన సైబర్ ముఠాలకు ఈ నకిలీ యాప్‌లను నెలకు రూ. 15,000 సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో క్రమం తప్పకుండా అప్‌డేట్లు ఇస్తూ సరఫరా చేసేవాడు. ఇందులో బాధితులు నమ్మి ఇన్‌స్టాల్ చేసుకునే “విక్టిమ్ యాప్”, వారి ఫోన్లలోని ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను నేరుగా చూసి నియంత్రించే “అడ్మిన్ యాప్” అనే రెండు వర్షన్లను రూపొందించాడు. ఈ ఏడాది మే నెలలో సూరత్‌కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో ‘PNB One.apk’ అనే నకిలీ లింక్ రాగా, దాన్ని నిజమైనదిగా నమ్మి ఇన్‌స్టాల్ చేసుకుని రూ. 5 లక్షలు పోగొట్టుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

బాధితుడు సైబర్ హెల్ప్‌లైన్ (1930)కి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. రోహిత్ మొత్తం 121 హానికరమైన యాప్‌లను తయారు చేయగా, అవి దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఇన్‌స్టాల్ అయ్యాయని, వాటిలో 2,928 ఫోన్లు పూర్తిగా నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లాయని తేలింది. వీటి ద్వారా ఏకంగా 54,094 అక్రమ లావాదేవీలు జరిపి రూ. 64.38 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఇందులో ఆర్టీఓ చలాన్ నకిలీ యాప్‌ల ద్వారానే అత్యధిక నేరాలు జరిగాయి. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన సైబర్ ముఠాల గుట్టు విప్పేందుకు విచారణను వేగవంతం చేశారు.