NTV Telugu Site icon

Supreme Court: రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్‌ ప్రభుత్వానికి నోటీసులు

Caste Survey

Caste Survey

Supreme Court: బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుల గణన వివరాలను ప్రచురించకుండా బీహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని, రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.బీహార్‌లో కులాల సర్వేకు అనుమతినిస్తూ ఆగస్టు 1న పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలను అడ్డుకోలేమని కోర్టు పేర్కొంది. అయితే సర్వే సమయంలో తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం పబ్లిక్ చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం జనవరిలో విచారణకు రానుంది.

Also Read: Supreme Court: ఓటర్లకు ఉచితాలు.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నితీష్ ప్రభుత్వం కులాల సర్వే నివేదికను బహిరంగపరిచింది. మరోవైపు కుల సర్వేపై పిటిషన్‌ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ తేదీని అక్టోబర్ 6వ తేదీకి నిర్ణయించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల గణనలో వ్యక్తుల వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని చెప్పబడింది. అలాగే జనవరిలోగా నోటీసుపై స్పందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఏమిటి?
బీహార్‌లో కుల గణన నివేదిక ప్రకారం, అత్యంత వెనుకబడిన తరగతి (EBC) జనాభా 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతి (OBC) 27 శాతం. షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం. రాష్ట్రంలోని మొత్తం 13 కోట్లకు పైగా జనాభాలో అగ్రవర్ణాల వారు 15.52 శాతం ఉన్నారు. సర్వే ప్రక్రియ లేదా సర్వే ఫలితాల ప్రచురణపై స్టే విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పదేపదే నిరాకరించింది. అయితే, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని కోర్టు చెప్పింది.

Show comments