Site icon NTV Telugu

Colonel Sofiya Qureshi: ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం సీరియస్‌!

Supremecourt

Supremecourt

కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్ షాకు ధర్మాసనం సూచించింది.

తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాదుల సోదరి’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. మోవ్ తహసీల్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సెక్షన్లు 152, 196(1)(b), 197(1)(c) కింద ఎఫ్ఐఆర్ నమోదయింది.

Also Read: IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. ఆ ప్లేయర్స్ ఈ సీజన్‌ వరకే!

హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్ షా తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ క్షమాపణలు చెప్పారని, మీడియా ఆయన ప్రకటనను వక్రీకరించిందని తెలిపారు. అందుకు మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీజేఐ ప్రశ్నించారు. మంత్రి పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మంత్రిపై దాఖలైన పిటిషన్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అంతేగాకుండా మంత్రి తీరును తప్పుపట్టింది. ముందెళ్లి క్షమాపణ చెప్పండి అని సూచించింది.

Exit mobile version