త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. శనివారమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరులో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఈవీఎంల పనితీరులో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను శుక్రవారం భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఊహాజనితమైన ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌ను విచారించలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రతీ విధానంలోనూ సానుకూల, ప్రతికూల అంశాలుంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది.
గత కొన్ని ఏళ్లుగా భారతదేశంలో ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు ఉన్నాయంటూ ఎప్పుటి నుంచి ఆయా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు పిటిషన్లను కోర్టు విచారించింది. తాజా పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. దీన్ని విచారించలేమని పేర్కొంది.