Supreme Court: సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఒక సంచలన తీర్పు సమాజంలో ఏళ్లుగా పాతుకుపోయిన పాత ఆలోచనలు, అపోహలను పటాపంచలు చేసింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదని, కేవలం ఆ కారణంతో వారి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కాలం మారింది.. దానికి తగ్గట్లే సామాజిక వాస్తవాలు, వ్యక్తుల ఆలోచనలు సైతం మారుతున్నాయనే నిజాన్ని వ్యవస్థలు గుర్తించాల్సిన అవసరం ఉందంటూ న్యాయమూర్తులు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఓ విప్లవాత్మకమైన సందేశాన్ని ఇచ్చింది.
తెలంగాణ యువకుడి పోరాటం..
ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కథ తెలంగాణకు చెందిన గజుల తిరుపతి అనే ఒక యువకుడి ఉద్యోగ పోరాటంతో ముడిపడి ఉంది. పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థిగా ఎంపికైన తిరుపతి, తన గతాన్ని దాచకుండా అప్లికేషన్‌లో ఓ విషయాన్ని నిజాయితీగా వెల్లడించాడు. 2014లో తన పొరుగున ఉండే ఒక యువతితో ఉన్న ప్రేమ సంబంధం కారణంగా అతనిపై ఒక క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు ఓ రాజీకి రావడంతో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. అతడిపై ఎలాంటి అత్యాచారం (IPC 376) ఆరోపణలు రుజువు కాలేదు. కానీ, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మాత్రం దీన్ని నైతిక ప్రవర్తనా లోపంగా భావించి, అతడి ఉద్యోగాన్ని రద్దు చేసింది. దీనిపై తిరుపతి సుదీర్ఘ న్యాయపోరాటం చేశాడు. హైకోర్టు సింగిల్ జడ్జి అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, డివిజన్ బెంచ్ దాన్ని తిరస్కరించడంతో చివరికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, కేవలం ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించిన వివాదంగా మాత్రమే కాకుండా.. చట్టం, వ్యక్తిగత స్వేచ్ఛ, మారుతున్న సామాజిక విలువలకు అద్దం పట్టేలా విస్తృతమైన కోణంలో తీర్పునిచ్చింది. ప్రతి ప్రేమకథా పెళ్లిపీటల దాకా వెళ్లాలని రూలేం లేదని, పెళ్లితో ముగియని ప్రతి బంధాన్ని మోసం లేదా వంచన కింద జమకట్టలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరు మనుషులు కొన్ని ఏళ్లపాటు ఇష్టపూర్వకంగా కలిసి జీవించినప్పుడు, ఆ బంధం పరస్పర అంగీకారంతోనే సాగిందని భావించాలే తప్ప.. పెళ్లి చేసుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఒకరిని నేరస్థుడిగా చూడలేమని స్పష్టం చేసింది. గతంలో ఇలాంటి పెళ్లి హామీ మోసం కేసులను కోర్టులు కొట్టేసిన సందర్భాలను సైతం న్యాయమూర్తులు గుర్తుచేశారు.
తిరుపతికి ఉద్యోగం ఇవ్వాలని కోర్టు ఆదేశం..
అలాగే రిక్రూట్‌మెంట్ బోర్డుల తీరును తప్పుబడుతూ న్యాయస్థానం మరో కీలకమైన పాయింట్‌ను ప్రస్తావించింది. “లోక్ అదాలత్‌లో ఒక కేసు రాజీ అయిందంటే.. దాన్ని నిందితుడు తప్పు ఒప్పుకున్నట్లుగా భావించకూడదు. బాధితురాలిని బెదిరించి లేదా బలవంతం చేసి ఆ రాజీ కుదుర్చుకున్నారనే బలమైన ఆధారాలు ఉంటే తప్ప.. అధికారులు ఆ అభ్యర్థి(తిరుపతి) క్యారెక్టర్‌ను తప్పుబట్టడానికి వీల్లేదు. సదరు యువతిని తిరుపతి మోసం చేశాడా లేదా అనేది కేవలం ఆమె మాత్రమే చెప్పగలదు. లోకానికి దాంతో సంబంధం లేదు. బాధితురాలే స్వయంగా కేసును వెనక్కి తీసుకుంటూ, రాజీకి అంగీకరించి తగిన సాక్ష్యాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు అధికారులు సొంతంగా ఊహించుకుని, తప్పుడు అర్థాలు వెతుకుతూ అభ్యర్థి ప్రవర్తనను అంచనా వేయడం తగదు.” అని కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా.. ఏదైనా ఒక నేరం జరిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు, ఆ నేరంలో సదరు వ్యక్తికి ఉన్న సంబంధాన్ని చూపే పత్రాలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి తప్ప, కేవలం అపోహలు, పాతకాలపు ఆలోచనలతో ఉద్యోగాలు నిరాకరించకూడదని స్పష్టం చేస్తూ తిరుపతికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సమాజంలో విఫలమైన ప్రేమకథల వల్ల ఎంతోమంది కెరీర్‌లు, జీవితాలు నాశనమవుతున్న ప్రస్తుత తరుణంలో.. కేవలం అనుమానాలతో ఒకరి క్యారెక్టర్‌ను జడ్జ్ చేయొద్దని చెప్పిన ఈ సుప్రీంకోర్టు తీర్పు దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, మారుతున్న యువత ఆలోచనలకు ఒక కొత్త భరోసానిచ్చింది.

