Director Krishna: నటశేఖరునికి దర్శకత్వం పైనా ఎప్పటి నుంచో అభిలాష ఉంది. ఏడాదికి పదికి పైగా చిత్రాలలో నటిస్తూ వచ్చిన కృష్ణ చిత్రసీమకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ పట్టు సంపాదిస్తూ వచ్చారు. ఆ మాటకొస్తే ఎడిటింగ్ లోనూ ఆయనకు ఎంతో నేర్పు ఉంది. తన అభిమాన హీరో యన్టీఆర్ తో కలసి తాను నిర్మిస్తూ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కథను చూసి, అంతకు ముందు వచ్చిన ఏయన్నార్ ‘కన్నకొడుకు’తో కొందరు ఫైనాన్సియర్స్ పోల్చారు. దాంతో తమ సినిమాను అటుఇటుగా మార్చి, తనదైన కూర్పుతో ‘దేవుడుచేసిన మనుషులు’ ఇప్పుడు మనం చూస్తున్న తీరులో మార్చారు కృష్ణ. అదిచూసి యన్టీఆర్, రచయిత మహారథి, దర్శకుడు వి.రామచంద్రరావు సైతం కృష్ణను అభినందించారు. అప్పటి నుంచీ కృష్ణకు కూడా దర్శకత్వం నిర్వహించాలని ఉండేది. తన నూరవ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’కు వి.రామచంద్రరావునే దర్శకునిగా ఎంచుకున్నారు. అయితే సినిమా మొదలైన కొద్దిరోజులకే రామచంద్రరావు అస్వస్థతతో తనువు చాలించారు. అందువల్ల కృష్ణనే మిగతా సినిమానంతా పూర్తి చేశారు. అయినా దర్శకునిగా రామచంద్రరావు పేరునే ప్రకటించారు. ఆ తరువాత పలుమార్లు దర్శకుడు కావాలనుకున్నారు కృష్ణ. కానీ, తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా అది వీలు పడలేదు.
చివరకు ‘సింహాసనం’ అనే జానపద చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తూ తొలిసారి అధికారికంగా మెగాఫోన్ పట్టారు కృష్ణ. తెలుగునాట తొలి 70 ఎమ్.ఎమ్.గా తెరకెక్కిన ఈచిత్రం ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. హిందీలో జితేంద్ర హీరోగా రూపొందిన ఈ సినిమా అక్కడా అలరించింది. ఆ తరువాత కృష్ణ దర్శకత్వంలో “శంఖారావం, ముగ్గురు కొడుకులు, నాగాస్త్రం, కొడుకు దిద్దిన కాపురం, అన్న-తమ్ముడు, ఇంద్రభవనం, అల్లుడు దిద్దిన కాపురం, మానవుడు-దానవుడు” వంటి చిత్రాలు తెరకెక్కాయి. వీటిలో తన తనయులు రమేశ్ బాబు, మహేశ్ బాబుతో కలసి ఆయన నటించిన ‘ముగ్గురు కొడుకులు’, మహేశ్ డ్యుయల్ రోల్ లో కనిపించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రాలతో పాటు ‘నాగాస్త్రం’ సైతం కమర్షియల్ గా అలరించింది.