Will Virat Kohli Play in IPL 2024: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విరాట్.. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్ 2024లో ఆడుతాడా? లేదా? అని ఇప్పుడు అందరి మెదడలను తొలుస్తున్న ఏకైక ప్రశ్న. దీనిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ పాల్గొనగా.. ‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ.. త్వరలోనే ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు. బ్రేక్ తర్వాత ఆడుతున్న విరాట్ పరుగుల దాహంతో ఉంటాడా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు గవాస్కర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ‘ఏవో కారణాలతో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆడట్లేదు. ఐపీఎల్ 2024 అయినా ఆడతాడా?. ఐపీఎల్ కూడా ఆడడేమో’ అని సన్నీ అన్నాడు. ప్రస్తుతం లిటిల్ మాస్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా విరాట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అకాయ్ అని నామకరణం చేసినట్లు కూడా తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు.
Also Read: IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్?
మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. త్వరలో భారత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరు ఏర్పాటు చేసే సన్నాహక శిబిరంలో అతడు పాల్గొనవచ్చు.